
- ఇమ్యునో గ్లోబిన్ ఇంజక్షన్ ఇవ్వరాదట..!
- ఇదీ జనగామ జిల్లా ఆస్పత్రి వైద్యుల తీరు
జనగామ, మన చౌరాస్తా : జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న జీజీహెచ్ పేరుకు పెద్దాస్పత్రే కానీ.. సేవలు మాత్రం అంతంతే అన్నది మరోసారి స్పష్టమైంది. ‘ప్రభుత్వ డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి..’ అంటూ ఓ పక్క జిల్లా జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులు చెబుతుంటే.. జీపీహెచ్లో మాత్రం అందుకు విరుద్ధంగా సేవలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే కేసులను ఎలా తప్పించుకుందామా అన్నట్టుగా డాక్టర్లు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానాలో కనీసం ఇమ్యునో గ్లోబిన్ ఇంజక్షన్ ఇవ్వరాని డాక్టర్లు ఉన్నారంటే.. వారి సేవలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..

రెఫర్.. రెఫర్.. రెఫర్..
పాలకుర్తికి చెందిన నాలి గౌతమ్ ఆరేళ్ల అనే చిన్నారిని కుక్క కరవడంతో శనివారం తల్లిదండ్రులు జనగామ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే జిల్లా ఆస్పత్రి డాక్టర్లు చిన్న బాబు కావడంతో చంపక్ హిల్స్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. అక్కడి వెళ్లాక చంపక్ హిల్స్ డాక్టర్లు సదురు బాబు తండ్రి శ్రీనివాస్‌ను ఇక్కడ వ్యాక్సిన్ లేదు జిల్లా ఆస్పత్రి వెళ్లాలని తిరిగి పంపించారు. తీరా జిల్లా ఆస్పత్రికి వచ్చాక ఇక్కడ వ్యాక్సిన్ ఉంది కానీ.. అది ఇవ్వడం రాదంటూ జీజీహెచ్ డాక్టర్లు అక్కడి నుంచి ఎంజీఎంకు రెఫర్ చేశారు. దీంతో బాధితులు ఉసూరుమంటూ అక్కడి నుంచి బయలుదేరి అర్ధరాత్రి ఒకటి తర్వాత ఎంజీఎంకు చేరుకుని బాబుకు వ్యాక్సిన్ వేయించారు. దీనిని బట్టి చూస్తే జనగామ జిల్లాలో ఆస్పత్రులు, డాక్టర్ల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక కుక్క కాటకు వ్యాక్సిన్ వేసేందుకు ఇక్కడి నుంచి అక్కడి.. అక్కడి నుంచి ఇక్కడి.. తర్వాత ఎంజీఎంకు రెఫర్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నారు.





