- బీజేపీ, బీఆర్ఎస్లో పదవుల కోసం పాకులాట
- గులాబీ టీంలో బావా.. బావమర్ధి పోటాపోటీ!
- బీజేపీలోనూ నువ్వానేనా అంటున్న లీడర్లు!
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిగ్గుందా..?
- కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌కు దమ్ముందా..?
- కిషన్‌రెడ్డి, రఘునంద్‌రావు మీ స్టాండ్ ఏమిటి..?
- ప్రతిపక్ష నేతలపై ఎమ్మెల్యే కడియం ఫైర్
- ఎన్నికల సభను తలపించిన మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
‘ బండి సంజయ్ నీకు సిగ్గు ఉందా.. కేంద్ర మంత్రి హోదాలో ఉండి రోడ్లపై ధర్నా చేసుడేంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌కు 2014 ఎన్నికలకు ముందు ఎన్ని ఆస్తులు ఉండే.. ఇప్పుడు ఎంత ఉన్నాయి.. ఈ ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ముందా..? ఇక బీజేపీ మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు హైడ్రాపై మీ స్టాండ్ ఏంటీ..?’ అంటూ ప్రతిపక్ష లీడర్లను ఏకిపారేశారు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..
మన చౌరాస్తా ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన సభ ఎన్నికల సభను తలపించింది. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు మార్కెట్ డైరెక్టర్లను కడియం అభినందించారు. అనంతరం మాట్లాడుతూ జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని అని అన్నారు. తాను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం జిల్లాకు ఎంతో మేలు చేసిందన్నారు. ఆనాడు నాటిన ఈ దేవాదుల బీజం.. మొక్కై.. చెట్టై.. ఇప్పుడు మహా వృక్షంగా జనగామ జిల్లా రూపు రేఖలు మార్చించిందని పేర్కొన్నారు. దేవాదులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నేడు అత్యధిక ధాన్యం దిగుబడి వచ్చే జిల్లాగా జనగామ మారిందన్నారు.
ప్రతిపక్షాలపై కడియం ఫైర్
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని అనవసరమైన ఆందోళనలు చేస్తూ వారిని పెడదారి పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడి చేయడం సరికాదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క గ్రూప్1, డీఎస్సీ నిర్వహించకుండా ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ఎస్లో హరీశ్‌రావు, కేటీఆర్ మధ్యలో పోటీ ఏర్పడిందన్నారు. పేపర్లు, టీవీ ఛానల్లో పోటీ పడి మరీ పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారని, 2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని.. ఈ రోజు వారి ఆస్తులు ఎన్ని.. ఈ ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ముందా అని కడియం సవాల్ విసిరారు.
బండి సంజయ్‌కు సిగ్గుండాలి..!
ఇక బీజేపీ నేతలకు ఏ హక్కుఉందని తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండి పడ్డారు. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి రోడ్డుపై కూర్చొని ధర్నా చేయడానికి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ గతంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు.. కనీసం 2 లక్షల ఉద్యోగాయాలు కూడా ప్రకటించలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు ఒకరు హైడ్రాను సమర్ధిస్తే, మరొకరు విమర్శిస్తున్నారని, ఒకరు మూసి ప్రక్షాళన చేయాలంటూ.. మరొకరు వద్దంటూ.. మాట్లాడడం వారిలో వారికి క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురాలేని నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే మండి పడ్డారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఎవరికి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. వీరికి దమ్ముంటే అందరూ ఒక ప్రెస్ మీట్ వారి హైడ్రాపై వారి స్టాండ్ ఏమిటో ప్రకటించాలని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సంకల్పనికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.