krishna kalamandhir : నేడే చూడండి..
‘నేడే చూడండి.. మీ అభిమాన ‘కృష్ణ’ కళామందిర్లో విక్టరీ వెంకటేష్ నటించిన ‘బొబ్బలి రాజా’.. రోజు నాలుగు ఆటలు..’ అంటూ అప్పట్లో మన గల్లీల్లో మూడు చక్రాల పోస్టర్ బండి పోతుంటే.. దాని వెనుక ఉరికే పిల్లలు గుర్తున్నారా..! నేనూ అలా పరిగెత్తిన వాడినే.. ఆనాటి నా ‘సినిమా’ లొల్లి అంతా ఇంతా కాదు..
మూడు బజార్లలో గోడ మీద కొత్త సినిమా పోస్టర్ పడిందా.. ఆ రోజు మా వాడలో పోరగాళ్లందరం బడి డుమ్మా కొట్టేటోళ్లం.. పెద్దోళ్లు కూడా పనికి సెలవు పెట్టి.. అంతా మార్నింగ్ షో (11 గంటల ఆట) కోసం ఉదయం 8 నుంచి 9 గంటల వరకే టాకీస్ గేట్ కాడ పడిగాపులు కాసేటోళ్లం. ఒకరి తెల్వకుండా ఒకరం వెళ్లినా.. అక్కడ తారస పడిన వెంటనే చిన్నాపెద్ద తేడా లేకుండా కలిసిపోయేటోళ్లం.. అంతా ఒకటయ్యోటోళ్లం.. అభిమాన హీరో ఆట కోసం ఆరాటపడేటోళ్లం..
టికెట్ల కోసం యుద్ధమే..
అప్పట్లో అభిమాన హీరో సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద జనం టికెట్ల కోసం పెద్ద యుద్ధమే చేసేటోళ్లు.. టాకీస్ గేట్లు, బుకింగ్ కౌంటర్ల వద్ద ఫైటింగ్ సీన్లు భలేగా ఉండేవి.. పోరాడి సాధించుకున్న టికెట్‌తో సంబురంగా సినిమా చూసి చెమట చుక్కలతో తడిసిన అంగిని ఇప్పి ఆరేసుకుంటున్నట్లు ఊపుకుంటూ బయటకు వచ్చే వాళ్లు.. కానీ, రానురాను ఆ పరిస్థితి మారింది. కళామందిర్లు కాస్త.. డీటీఎస్ థియేటర్లుగా, మల్టీప్లెక్సులుగా మారిపోయాయి. జనం కూడా ఆన్లైన్ అడ్వన్స్ బుకింగ్‌లు చేసుకుని హాయిగా మూవీ చూడడం అలవాటు చేసుకున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్ తో ఆరు నెలలుగా థియేటర్లు మూతపడడంతో ఓటీటీ ఫ్లాట్‌పై సినిమాలు చూడడం నేర్చుకున్నారు.
మూత పడి.. తెరుచుకుని..
కరోనా ఎఫెక్ట్ తో మూతపడిన థియేటర్లు, మల్టీప్లెక్సులు ఎట్టకేలకు మంగళవారం తెరుచుకున్నాయి. కేంద్ర హోం శాఖ సూచించినట్టుగా 50 శాతం సీటింగ్ కెపాసిటీని పాటిస్తూ థియేటర్లలో షోలు వేసేందుకు రెడీ అయ్యారు.. ఇయ్యాల ఎప్పటిలాగే వేరే పని కోసం మా జనగామ కృష్ణ కళామందిర్ (krishna kalamandhir) ముందు నుంచి వెళ్తూ.. అటు వైపు చూశా.. నాటి సంబురం కనిపించలేదు.. కళ తప్పిన థియేటర్ దీనంగా నా వైపు చూస్తున్నట్లుగా కనిపించింది. థియేటర్ తెరిచారో లేదో తెలియదుగానీ.. ‘ఒక్క ఆటన్న చూసిపో..’ అన్నట్లగా పిలిచినట్లు అనిపించింది. కానీ, రోజువారి పనుల్లో బిజీబిజీ అయిన నేను సినిమాలు చూడడమే మానేసేనని దానికి తెలియదు పాపం.. ఒక వేళ చూసినా ఆరచేతిలో ఉన్న ఆన్రైడ్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం ఉందిగా మరి..!
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)