Mallanna Press Meet : పిక్చర్ బాకీ హై
తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు ఆయన ఓ వ్యక్తి కాదు.. తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపుకుదిపిన ప్రభంజన శక్తి.. ఒక్కడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం రాష్ట్ర రాజకీయాలకు ఓ కొత్త దారిని చూపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఓ సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని మల్లన్న వంద శాతం నిరూపించాడు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. నైతిక విజయం ఆయనదే.. రిజల్ట్ వెలువడిన వెంటనే మల్లన్న ఎంతో హుందాగా మీడియాతో మాట్లాడిన తీరు తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకుంది.
మల్లన్న తనకు ఓట్లు వేసిన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ‘ఈ ఎన్నికలతోనే మల్లన్న సినిమా అయిపోలేదు.. ప్రగతి భవన్ గోడలు బద్దలగొట్టి ఓ సామాన్యుడిని సీఎం సీట్లో కూర్చోబెడతా.. పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్..’ అన్నట్లు అధికార పార్టీకి అల్టిమేటం ఇవ్వడం మామూలు విషయం కాదు. తాము మొదలు పెట్టిన పోరాటం 10 శాతం పూర్తయ్యిందని.. ఇంకా 90 శాతం యుద్ధం ముందుందని తన భవిష్యత్తు కార్యాచరణపై ఓ సంకేతం ఇచ్చారు.
మూడు రోజులు ‘మల్లన్న జపం’
మల్లన్న ప్రెస్మీట్లో ఇటు ప్రతిపక్షపార్టీలు, అటు మీడియా సంస్థలకు సుతిమెత్తగా చురకలు అంటించారు. వాస్తవానికి మల్లన్న ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన నాటి నుంచి ఒకటి రెండు మినహా మిగతా మీడియా సంస్థలు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రచారం అంతా దాదాపు సోషల్ మీడియా వేదిగానే కొనసాగింది. ఈ క్రమంలో ‘యూట్యూబ్లో లైక్లు కొట్టిన వారంతా ఓట్లు ఏస్తారా..’ అని కొందరు చులకనగా కూడా మాట్లాడారు. కానీ, కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత అనివార్యంగా మీడియా మల్లన్న వద్దకు వెళ్లక తప్పలేదు. అప్పటి వరకు ఆయన పేరు కూడా ఎత్తని కొన్ని చానళ్లు, పేపర్లు మూడు రోజుల పాటు ‘మల్లన్న జనం’ చేశాయి. ఇది గమనించే మల్లన్న‘కద్దరు బట్టలు వేసుకుని.. కారుల్లో దిగేటోళ్లే లీడర్లు అనుకోవద్దు.. నాలాంటి ప్రతి సామాన్యుడు లీడరే..’ అంటూ తనదైన శైలిలో మీడియాకు సూచన చేశారు.
సోషల్ మీడియాలో జేజేలు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థి వెన్నులో ఓటమి భయం సృష్టించిన తీన్మార్ మల్లన్నను ఇప్పుడు తెలంగాణ యువత పొలిటికల్ ఐకాన్ గా చూస్తోంది. స్వల్ప తేడాతో ఓడిన మల్లన్నకు సోషల్ మీడియాలో జేజేలు పలుకుతోంది. ఆయనకు సోర్ట్ గా పోస్టులు చేస్తోంది.
‘వందేళ్ల చరిత్ర గల పార్టీ ఒకటైతే.. సెంట్రల్లో పవర్లో ఉన్నది ఇంకోటి.. వీటిని ఓ మూలకు తోసినవ్.. అధికార టీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించినవ్.. వంద కోట్లు ఖర్చు పెట్టినోడికి గుండె ఆగినంత పని చేసినవ్.. నీ తరఫున పది మంది మంత్రులు తిరగలే.. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే నీకు లేడు.. లక్షల కార్యకర్తలకు నువ్వు సభ్యత్వం ఇయ్యలే.. అయినా గింత దాకా వచ్చినవ్ చూడు.. గింతకన్నా పెద్ద గెలుపు ఏముంటది.. హ్యాట్సాఫ్ మల్లన్న’
‘కోట్లు పంచి గెలిచిన గెలుపుకు అర్థం లేదు. ఒక్క రూపాయి పంచకుండా రెండో స్థానంలో వచ్చిన జన హృదయ నేత తీన్మార్ మల్లన్న..’
‘మల్లన్న లక్షల కోట్లు ఖర్చు పెట్టినా నీకు ఇంత గొప్ప పేరు రాకపోయేది. నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది.. ప్రశ్నించే గొంతుకు మరింత పదునెక్కింది. పాలకుల గుండెల్లో రైళ్లు మరింత వేగంగా పరిగెడతాయి. మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లు మల్లన్న.. మేము ఉన్నాం.. మీ వెంట..’ అంటూ ఎవరికి వారు పోస్టులు చేస్తున్నారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..