
13 తులాల బంగారు ఆభరణాల రికవరీ
రామకృష్ణాపూర్, మన చౌరాస్తా : గద్దె రాగడి పరిధిలోని పద్మావతి కాలనీలో శుక్రవారం రాత్రి మేకల రాజయ్య ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సీసీ కెమెరాల సహాయంతో 24 గంటల్లోనే ఛేదించినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు పద్మావతి కాలనీ,అమ్మ గార్డెన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అమ్మ గార్డెన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన జాడి సురేష్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనం చేసినట్లుగా నేరస్తుడు ఒప్పుకోవడంతో చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేసి అరెస్టు చూపించారు. కాగా నేరస్తుడు సురేష్ పై గతంలో ఐదు దొంగతనం కేసులు ఉన్నాయని అందులో మూడు కేసుల్లో శిక్షను అనుభవించినట్లు ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, ఆర్కేపీ ఎస్సై రాజశేఖర్, సీసీఎస్ ఎస్సైలు మధుసూదన్, లలిత, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.