mlc results : ఆ లేఖలే గెలిపించాయ్
ఉత్కంఠ భరితంగా సాగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అంతటా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గెలుపు ఓటములపై మీడియా, రాజకీయ పార్టీలే కాదు.. ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లు కూడా చర్చలు సాగిస్తున్నారు. ఇద్దరు మిత్రుల మధ్య ఫోన్లో సాగిన చర్చ ఇది…
‘హాయ్.. సురేశ్ బాగున్నావా..’
‘హాయ్.. రమేశన్నా బాగున్నా.. ఏంది చానా రోజులకు యాది కొచ్చిన..’
రమేశ్ : మీ నల్లగొండోళ్లు గిట్ల జేసిరేందివయ్యా..!
సురేశ్ : ఏమైందే అన్నా..!
రమేశ్ : జాబ్‌లు కొట్టుట్ల.. రాజకీయ చైతన్యంల.. మీ జిల్లా వోళ్లే తోపులు కదా! డీఎస్సీలో వేరే జిల్లాలకు పోయి నాన్ లోకల్ కోటాలో ఓపెన్ లో జాబ్‌లు కొడతరు. చదువులళ్ల కూడా ముందుంటరు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గిట్ల బోల్తా పడ్డరేంది రా.. మీ కంటే మేమే బెటర్ కదా..’
సురేశ్ : ఏట్లనే..
రమేశ్ : 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా దగ్గర జీవన్‌రెడ్డిని గెలిపించినం కదా (నవ్వుతూ..)..! అధికార పార్టీ క్యాండిడెట్ను డైరెక్ట్‌గా పెట్టకుండా ఆర్టీవో జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి వెనుకాల నుంచి మద్దతు తెలిపినా కూడా ఓడిపోయిండు.
సురేశ్ : కరెక్టే అన్నా…!
రమేశ్ : ప్రొఫెసర్ కోదండరామ్ తెంలంగాణ ఉద్యమమప్పుడు జేఏసీ నేతగా ఉండి అంతగనం కష్టపడి రాష్ట్రం కోసం కొట్లాడిండు. రాష్ట్రం వచ్చినంక ఏ పార్టీలో దూకకుండా సొంతంగా పార్టీ పెట్టుకుండు. 2018 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును కూడా త్యాగం చేసిండు. ఇప్పుడైనా గెలిపిస్తరనే ఆశతో వరంగల్– ఖమ్మం– నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడిండు. అందరినీ కలిసిండు. ఊరూరు తిరిగిండు. ఉద్యోగులను, నిరుద్యోగులను కలిసిండు. ఓటేయమని కోరిండు. కానీ ఎన్నికల్లో పాపం ఆయనకు రెండో ప్లేసు కూడా దక్కలేదు. గిట్ల జేసిరేందే. ఆయనను గెలిపించుకుంటే ఏం పాయే.. లేకంటే తీన్మార్ మల్లన్నకు అన్నా గెలిపించుకోలేకపోయారు. ఏం విద్యావంతులే మీ జిల్లా వోళ్లు..!
సురేశ్ : (ఏం జెప్పాలో తెలియలేదు). నా దేముందే.. నా ఓటు నేను న్యాయంగానే వేసినా అన్నాను. ‘సరే తీయ్.. ఉంటా..’ అంటూ రమేశ్ ఫోన్ కట్ట్చేసిండు.
ఆ తర్వాత సురేశ్ మదిలో ఆలోచనలు గిర్రున తిరిగాయి..
రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిందే ఆరు ఉమ్మడి జిల్లాల్లో అయినా రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠ రేపాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే అందరిచూపు ఈ ఎన్నికలపైనే ఉంది. ఇక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రమంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ వచ్చాక ఎప్పుడు ఇలా ఎన్నికలు జరగలేదు. 2015లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి గెలిచిన రామచంద్రరావు మళ్లీ సిట్టింగ్ స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ అధికార పార్టీ అభ్యర్థులపైనే అందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు. 2014, 2018 లో రెండుసార్లు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన తెలంగాణలో జంప్ జిలానీ రాజకీయాలు మొదలయ్యాయి. ఇక ప్రతిపక్షం ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలను టీఆర్ఎస్ ఉనికికోల్పోయేలా చేసింది. ఆ రెండు ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.
మొదట దోస్తీ..
ఇక తెలంగాణలో మొదటి టర్మ్ కేంద్రంలో బీజేపీతో దోస్తీ కట్టిన కేసీఆర్ రెండో టర్మ్‌కు వచ్చేసరికి బద్ధ శత్రువుగా మారిపోయారు. తనకు తిరుగులేదనుకుండగా 2019లో ‘సారు.. కారు .. సర్కార్’ నినాదం బోల్తా కొట్టింది. టార్గెట్ గా పెట్టుకున్న ఎంపీ సీట్లు దక్కలేదు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. సరైన ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీదే రాష్ట్రంలో పెత్తనమంతా సాగుతోంది. ఇక 2020లో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తర్వాత అనూహ్యంగా బీజేపీ ఆ సీటును దక్కించుకుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయమంటూ పోటీపోటీగా ప్రచారం చేసుకుంటుంది. 2020 నవంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పూర్తి మెజార్టీ కార్పొరేటర్ల సంఖ్యను సాధించలేకపోయింది. ఎంఐఎం మద్దుతు, ఎక్స్అఫిషియో ఓట్లతో మేయర్ సీటును దక్కించుకుంది. అనంతరం వచ్చిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేనంతగా ఈసారి ఎమ్మెల్సీ తెరమీదకు వచ్చాయి. ఉత్కంఠతో సాగాయి.
వీటిపైనే అందరి దృష్టి
నోటిషికేషన్ రాకముందు నుంచే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. వరంగల్– ఖమ్మం– నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికైతే ఎంతో ఉత్కంఠతను రేపింది. తెలంగాణ ఉద్యమ జేఏసీ నేత కోదండరామ్, ఉద్యమకారులు పీడీ యాక్ట్ కింద అరెస్టయిన చెరుకు సుధాకర్, రాణి రుద్రమరెడ్డి తదితర నేతలు బరిలో దిగారు.2015లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తీన్మార్ మల్లన్న కూడా పోటీలోకి వచ్చారు. ఎప్పుడైతే వీరంగా పోటీ చేస్తున్నామని ప్రకటించారో అప్పటి నుంచే రాష్ట్రమంతటా జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఇక హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబునగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు బరిలో ఉండగా, టీఆర్ఎస్ ఎవరినీ ప్రకటించకపోవడంతో అంతటా చర్చనీయాంశమైంది. ఒక దశలో ప్రొఫెసర్ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు మద్దతు తెలుపుదామనే నిర్ణయం దాకా టీఆర్ఎస్ అధిష్టానం వెళ్లింది. కానీ భవిష్యత్‌లో నెగెటివ్ ప్రచారం ఊపందుకోనుందనే ఆలోచనతో వెనక్కి తగ్గింది. నామినేషన్‌కు రెండు రోజులు గడువు ఉందనే టైమ్‌లో మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీ దేవిని పోటీలో నిలిపింది. ఈ నిర్ణయంతో కేసీఆర్ అందరిని తనవైపు తిప్పుకునేలా చేశారు.
ప్రచారం హోరు.. మద్దతు లేఖల జోరు
ఎన్నికల నామినేషన్లు, తిరస్కరణలు పూర్తయ్యాక బరిలో నిలిచిన క్యాండిడేట్ల ప్రచారం జోరుగా సాగింది. కానీ అధికార పార్టీ గల్లీ స్థాయి నేత నుంచి రంగంలోకి దింపింది. మొదటి నుంచి గెలుపు ధీమాతోనే ముందుకెళ్లింది. ఇక ప్రచారంలోనూ ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలతోనే మీటింగ్‌లు పెట్టింది. వారిపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. చివరకు ఓట్ల కోసం మద్దతు లేఖలు ఇచ్చేలా చేసుకుని తనమైపు తిప్పుకుంది. ఇక్కడే మొదటి దశ సక్సెస్ అయ్యింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించకపోవడం, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు లాంటి హామీలు ఇవ్వడంతో పాటు కేసీఆర్ ఎన్నికల వారం రోజులకు ముందు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. పీఆర్సీ, ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. దీంతో వెంటనే ఉద్యోగ సంఘాలు పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. అదే విధంగా డబ్బు పంపకాలు కూడా భారీగానే చేసింది.
తగ్గిపోయిన రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు
ఇక నాలుగు రోజులు సాగిన కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే.. మొదటి ప్రయార్టీలో అధికారపార్టీ అభ్యర్థులే రెండు చోట్ల ముందంజలో ఉన్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి పల్లా, తీన్మార్ మల్లన్న, కోదండరాం పోటీపోటీగా కొనసాగారు. హైదరాబాద్ స్థానం నుంచి వాణీదేవి, రామచందర్‌రావు, నాగేశ్వర్‌ల మధ్య అదే పరిస్థితి నెలకొని ఉన్నా.. ఎలిమినేషన్ ప్రక్రియకు వచ్చే సరికి అంతా తారుమారు అయ్యిందని చెప్పొచ్చు. మొదటి ప్రధాన్యత ఓటు వేసిన వారు రెండో, మూడో ప్రాధాన్యతను వేరే అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో రెండు స్థానాల్లోనూ అధికారపార్టీ అభ్యర్థులు గెలించేందుకు అవకాశం ఏర్పడింది. గ్రాడ్యుయేట్లు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉన్నా. కానీ తమకు రావాల్సిన పీఆర్సీ, ఇతర అంశాలపై సానుకూలత వ్యక్తం చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించారనే చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం కూడా ఉంది. ఇంకా మూడేళ్ల పాలన ఉండడంతో భవిష్యత్‌లో ఏవైనా ఇబ్బందులు రావచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి ఉండోచ్చని అర్థమవుతోంది.
– సురేశ్ వేల్పుల, డెస్క్ జర్నలిస్ట్
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..