- ఎస్సీ స్థానంలో ఎక్కడ చాన్స్ ఇచ్చినా నేను రెడీ
- పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య
జనగామ, (మన చౌరాస్తా) : అవకాశం వస్తే వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జనవరి 26 గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మొదటిసారి జనగామలో ప్రెస్మీట్ పెట్టి రాజకీయ ప్రవేశంపై తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిందు యక్షగాన కళాకారుడిగా తాను సుమారు 20 వేల ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చానని, తాను ప్రజాప్రతినిధిగా మారితే ప్రత్యక్షంగా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గానికి చెందిన తనను గుర్తించి ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఎస్సీ ఉప కలానికి చెందిన తమకు ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యం ఇచ్చినా గౌరవిస్తామన్నారు. అక్షరాస్యత, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేదం, కుటుంబ నియంత్రణ కోసం తన కళ ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకువచ్చానని, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయగలనని చెప్పారు. తన లాంటి కళాకారులను చట్టసభల్లోకి పంపేందుకు రాజకీయ పార్టీలు చొరవ చూపాలని కోరారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నందున, ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు.