mrugadu : తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడైన సంజయ్‌కుమార్ నేరం రుజువైంది. ఈ ఏడాది మే 20న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట బావిలో 9 మందిని హత్య చేసిన ఆ మృగాడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి కావురి జయకుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో న్యాయ స్థానంపై మరింత నమ్మకంపై పెరిగింది అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ హత్యలను సీడీఆర్ (కాల్ డేటా రికార్డింగ్) ఆధారంగానే పోలీసులు ఛేదించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అప్పట్లో మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘నగర శివారులో గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్, అతడి భార్య పనిచేసే వారు. ఈ క్రమంలోనే బిహార్‌కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్‌కు ఆ కుటుంబంతో పరిచయం అయ్యాడు. అలా నిషా అక్క కూతురు రఫీకా (31)తో కూడా పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజీవ్ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్‌ను నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. (mrugadu)
ఇంటికని చెప్పి.. రైల్లోంచి తోసేసి
పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్ యాదవ్ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్ రథ్ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లో నుంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, తన అక్క కూతురు గురించి మక్సూద్ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్ కుటుంబాన్ని కూడా హతమార్చాలని టార్గెట్ పెట్టుకున్నాడు.
ఐదు రోజులు రెక్కీ.. ఆపై హత్యలు
మే 16 నుంచి 20 వరకు నిందితుడు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. మే 20న మక్సూద్ మొదటి కుమారుడైన షాబాజ్ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18న వరంగల్ చౌరస్తాలో ఓ మెడికల్ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20న రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న ఎండీ మక్సూద్ (50), ఆయన భార్య నిషా (45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు (3), షాబాద్ (22), సోహైల్ (20), బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్ (22), శ్రీరామ్ (20), వరంగల్ వాసి షకీల్ ను గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.
ఐదు నెలల్లో శిక్ష..
కేస్ ఫైల్ అయినప్పడి నుంచి కేవలం ఐదు నెలల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించారు. ఈ సందర్భంగా మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ సీఐ శివరామయ్యను పలువురు అభినందించారు.