ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారిని కలిశారు. బకాయి పడిన నాలుగు వాయిదాల డిఎలు ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మూడు వాయిదాల కరువు భత్యం (డిఎ) ను విడుదల చేయకుండా బకాయి పడింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ, సప్లిమెంటరీ వేతనాలు, సరెండర్ లీవులు, గత పిఆర్సీ బకాయిలు, మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షనరీ బెనిఫిట్స్ తదితర వేలాది బిల్లులు ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ సంబంధితుల ఖాతాల్లో జమ కావడం లేదు. 010 పద్దు ద్వారా వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నారు కానీ గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, కెజిబివి, యుఆర్ఎస్ సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల మొదటి తేదీన వేతనాలు అందటం లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేనురోజుల్లో పెండింగ్ లో ఉన్న మూడు డిఎలు ఇస్తామని, ఉద్యోగులందరికీ నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామని, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పది నెలలు గడిచినా డిఎలు, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం చేత ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కనుక తక్షణమే బకాయి పడిన నాలుగు వాయిదాల డిఎలు ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ కోరింది. ఈ భేటీలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో పాటు
టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, నాయకులు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.