- ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
- జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, మన చౌరాస్తా : అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించి చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్తీలో గల ఎంపీయూపీఎస్, ఉర్దూ మీడియం ఎంపీయూపీఎస్ పాఠశాలలు, శామీర్‌పేటలోని జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఎల్లంల ఎంపీపీఎస్ పాఠశాల, బాణాపురం పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలల్లో విస్తృత పర్యటన చేపట్టి స్కూళ్లలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 291 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటికే 93 పాఠశాలల్లో మౌలిక వసతులు, సుందరీకరణ పనులు పూర్తయ్యాయని, మిగతా పాఠశాలల్లో కొనసాగుతున్న మరమ్మతుల పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం రఘునాథపల్లి మండలంలోని ఆశ్వారావుపల్లి, వెల్ది గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సేకరించిన ధాన్యం, తరలింపు, తేమ శాతం గురించిన తదితర వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 1 నుంచి రుతుపవనాలు రానున్నందున కొనుగోళ్లను మరింత స్పీడప్ చేయాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని, ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు వచ్చినందున, మిగిలి ఉన్న ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. కొనుగోళ్ల వివరాలను వెంటవెంటనే ఓపీఎంఎస్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. తద్వారా సకాలంలో రైతులకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఆయన వెంట డీఈఓ రాము, డీసీఎస్ఓ రోజారాణి, డీఆర్డీఓ మొగులప్ప, డీఎం సీఎస్ ప్రసాద్, డీటీ సీఎస్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఉన్నారు.