- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, మన చౌరాస్తా : బంజారల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క కోరారు. బుధవారం హైదారాబాద్ కొంపెల్లిలో ఉన్న సంత్ సేవాలాల్ మహారాజ్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారన్నారు. ఆయన పరమపదించి దాదాపు 200 ఏళ్లు దాటినా మహరాజ్‌ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అహింసా మార్గాన్ని అవలంబించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి అందేలా కృషి చేయాలని సీతక్క సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.