
- యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకుల మనోజ్
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో భీమదేవరపల్లి ఎస్సీ బాయ్స్ హాస్టల్‌ను జిల్లా అధ్యక్షుడు ఆకుల మనోజ్, మండల నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను సమీక్షించారు.
ఆకుల మనోజ్ మాట్లాడుతూ, చలికాలం మొదలైన సందర్భంలో విద్యార్థులకు ప్రభుత్వం నుండి దుప్పట్లు సరఫరా చేయలేదని, వేడి నీటికి గ్రీజర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్టల్లో భోజన మెనూ సరిగా అమలు కావడం లేదని, ఆట వస్తువులు లేకపోవడం విద్యార్థుల శారీరకాభివృద్ధికి ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టల్లో నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్ల విద్యార్థులు రాత్రి భయాందోళనలకు గురవుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే అవకాశం లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
“గత వారం హాస్టల్లో ఎనిమిదో తరగతి, పదవ తరగతి విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి సంఘటనను అధికారులు సరైన విధంగా పరిష్కరించకుండా, విద్యార్థులను కౌన్సిలింగ్ లేకుండానే ఇంటికి పంపడం తగదు. దీనివల్ల వారు చదువుకు దూరమవుతూ మానసికంగా ప్రభావితమవుతున్నారు,” అని ఆకుల మనోజ్ అన్నారు.
ఈ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించాలని, రెగ్యులర్ నైట్ వాచ్‌మెన్‌ను నియమించి హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు విష్ణు, శివ, కోటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.




