ఆయనో సీనియర్ జర్నలిస్ట్.. ఎంత సీనియర్ అంటే.. ఆయన మొదటి నెల జీతం అప్పట్లో 85 రూపాయలు. తను జర్నలిజానికి గుడ్ బై చెప్పే నాటికి రూ.40 వేలు.. దాదాపు 35 ఏళ్లు జర్నలిస్ట్ గా పనిచేసి ఆస్థులు సంపాదించకపోగా.. అప్పులు మూటగట్టుకున్నాడు. ఉద్యోగం మానేసి బతుకు బండిని లాగేందుకు ఇబ్బంది పడ్డాడు. కానీ మళ్లీ ‘కొత్త దారి’ని వెతుక్కుని ఇప్పుడు వెలిగిపోతున్నాడు.. ఆయన ఎవరో కాదు.. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశపల్లికి యాటకర్ల మల్లేశ్.. గీత కార్మికుడి కుటుంబంలో జన్మించిన మల్లేశన్న.. 1985 ‘ఉయదం’ దినపత్రికతో జర్నలిజంలోకి అడుగుపెట్టిన ఆయన సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా వివిధ సంస్థల్లో పని చేశారు. నాకు ఆయనతో అనుబంధం తక్కువే అయినా.. మల్లేశన్న మనస్తత్వం, కలుపుగోలు తనానికి నేను ఫిదా అయిపోయా.. అందుకే డెస్క్ జర్నలిస్టుల కథనాల కోసం మొదలు పెట్టిన ‘కొత్త దారిలో పాతమిత్రులు’ శీర్షకకు మొదటి సారి ఓ సీనియర్ జర్నలిస్టును పరిచయం చేస్తున్నా.. మరెందుకు ఆలస్యం మల్లశన్నతో సాగిన మాటా ముచ్చట ఆయన మాటల్లోనే..
నేను స్కూల్లో చదివింది 5వ తరగతే..
నేను స్కూల్లో చదివింది 5వ తరగతి వరకే.. మాఊరిలోని వడ్ల గోవర్ధన్ సార్ సలహాతో 10వ తరగతి ప్రైవేట్‌గా పరీక్ష రాసి పాసయ్యాను. ఆ తర్వాత బి.ఆర్ అంబేద్కర్ ఒపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అండ్ పీజీ (సోషలాజీ) పూర్తి చేశాను. నా 15 ఏళ్ల వయసులో నాన్న (ఈదుల్ల మల్లయ్య) ఆనారోగ్యంతో చనిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా కుటుంబ బండిని లాగడానికి ఎంతో కష్టపడ్డాను. నాకు తమ్ముడు దేవేశ్, ముగ్గురు చెల్లేళ్లు. (మల్లాయి, సావిత్రి, సులోచన)
‘ఉదయం’తో ఎంట్రీ..
మా ఊళ్లో ఓ ఉన్మాది తోకల సాయన్న తాగిన మత్తులో అక్కా-తమ్ముడిని బరిసెతో పొడిచి హత్య చేశాడు. ఆ వార్త తెల్లారి ఈనాడు దిన పత్రికలో చూసి ఆశ్చర్య పోయాను. మారుమూల పల్లెటూరులో జరిగిన ఈ జంట హత్యల గురించి ఆ పేపరోళ్లకు ఎలా తెలిసిందని ఆలోచనలో పడ్డాను. నాకు ఎప్పుడూ మీడియా వైపు వెళ్లాలని లేదు. కానీ.. ప్రజల కోసం మా ఊరిలో రైతుకూలీ (ఫైల వర్గం) సంఘం ఆధ్వర్యంలో నవోదయ యువజన సంఘం ఏర్పాటు చేశారు. అక్కడ అభ్యుదయ సాహిత్యం చదువడం అలవాటు కావడంతో సమాజంలో జరిగే అన్యాయాలపై అవగాహన వచ్చింది. వాటిపై ఫోకస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది. దానికి జర్నలిస్టుగా మారితే బాగుటుందని అనుకున్నా.. అప్పటి నుంచే విలేకరి కావడం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ సారి నిజామాబాద్‌లో ఓ పెళ్లికి పోయిన. అక్కడ సిర్ప గంగాధర్ (రైతు కూలీ సంఘం ఆర్గనైజర్‌గా పరిచయం) అన్న కలిసి ‘ఉదయం’ దిన పత్రికకు డిచ్పల్లి విలేకరి పోస్టు ఖాళీ ఉంది.. పలానా రోజు ఎగ్జామ్, ఇంటార్వ్యూ ఉంది నువ్వు అటెండ్ చెయ్యి అన్నారు. మొదట నేను చదివిన చదువుకు విలేకరిగా పనిచేయడం సాధ్యమా అనుకున్నాను. అతని ప్రొత్సహంతో ఎగ్జామ్ రాసి ఇంటార్వ్యూ పూర్తి చేసిన తర్వాత విలేకరిగా అపాయింట్మెంట్ ఆర్డర్ రావడంతో నాకు నేనే నమ్మలేక పోయాను. అలా 24 జూన్ 1985లో ప్రారంభమైంది.. అప్పుడు నువ్వు పుట్టినవో లేదో.. నరేంద్రా.. (నవ్వుతూ…)
24 జూన్ 1985 ‘ఉదయం’ దిన పత్రికతో ఎంట్రీ.. 1986లో ఆంధ్రజ్యోతి, 1989లో మళ్లీ ఉదయం, 1996లో వార్త, 2007లో సూర్య, 2009లో స్టూడియో (ఎన్) టీవీ, 2010 ఐ న్యూస్, 2012 నుంచి 2021 వరకు వీ6 న్యూస్ ఛానళ్లలో పనిచేశాను.
మొదటి నెల జీతం రూ.85
1985లో ‘ఉదయం’లో వార్తలను సెంటి మీటరుకు 40 పైసాలు. అది గౌరవ వేతనం. మొదటి సారి నేను అందుకున్న నెల జీతం 85 రూపాయలు. కానీ.. ఆ గౌరవ వేతనం కంటే నేను విలేకరిగా పని చేస్తున్నానే గౌరవమే నాకు కోట్లు సంపాదించినంత. అయితే.. 35 ఏళ్ల తర్వాత నా నెల వేతనం రూ.40 వేలు.
ఎక్కువ శాతం నక్సల్స్ ఇలాఖలోనే..
నేను జర్నలిస్ట్ గా నక్సల్స్ ఇలాఖాలోనే ఎక్కువ కాలం పని చేసాను. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లింది కూడా అదే ప్రాంతం. ‘వార్త’ దినపత్రికలో ఎస్ జీవీ.శ్రీనివాస్ రావు ఎడిషన్ ఇన్చార్జి సహాకారంతో పీపుల్స్ వార్ నక్సల్స్ ఉద్యమంపై 14 రోజులు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన అభాగ్యుల కథనాలు 18 రోజులు ఇచ్చిన సీరియల్‌గా ఇచ్చిన కథనాలను జీవితాంతం మరిచి పోలేను. నా జర్నలిజం జర్నీలో మరిచి పోలేని కథనాలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పై కంట్రాక్టర్ల దోపిడీ వరుస కథనాలు తృప్తి నిచ్చాయి..
అప్పట్లో నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పని చేసిన డాక్టర్ శంకర్ అయ్యార్ ముందు ఓ నక్సలైట్ లొంగిపోయాడని చూపించారు. వాస్తవానికి అతడు ఓ దొంగ.. దీనిపై ‘పప్పులో కాలేసిన ఎస్పీ’ అంటూ దొంగను లొంగుబాటుగా చూయించారని రాసిన కథనం మరిచి పోలేనిది.
దుబాయ్‌కి వెళ్లిపోయా..
నక్సల్స్ ఇలాఖలో విలేకరిగా పని చేస్తున్న నేను వారి సిద్ధాంతాలు, లక్ష్యం తెలుసుకోవడానికి విప్లవ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరయ్యాను. ఆ సమయంలోనే నన్ను ఇన్ఫార్మర్గా మార్చుకోవడానికి పోలీసు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సందర్భంలో ఆర్మూర్‌లో సీఐ లింగారెడ్డిని నక్సల్స్ కాల్చి చంపారు. అంతే.. నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వేట ప్రారంభించారు. క్షణం క్షణం భయం భయంగా రహస్యంగా గడిపిన రోజులు ఉన్నాయి. తప్పని సరి పరిస్థితుల్లో దుబాయ్ పారిపోయా.. (నవ్వుతూ.. లేదు లేదు వెళ్లి పోయాను) కొంత కాలానికి ఆ సీఐని హత్య చేసిన నక్సలైట్లు బెంగుళూర్లో అరెస్ట్ కావడంతో నాకు ఆ సీఐ హత్యతో నాకు సంబంధం లేదని పోలీసులే తేల్చారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన నేను మళ్లీ జర్నలిస్ట్ గా పనిచేశాను.
అస్తులు కాదు.. అప్పులు మిగిలాయి..
దాదాపు 35 ఏళ్లుగా జర్నలిజం వృత్తి ఎన్నో అనుభవాలను నేర్పింది. జర్నలిస్ట్ గా ఆస్థులు సంపాదించక పోవచ్చు.. కానీ ఉన్న దాంట్లో సంతృప్తిగా బతికాను. నేను గీత కార్మికుడిగా 1983లో నెలకు రూ.15 వేలు సంపాధించేది. కానీ.. 2014లో జర్నలిస్ట్ గా నా నెల వేతనం రూ.18 వేలు. 2020లో జర్నలిస్ట్ గా రాజీనామ చేసిన నాటికి నా నెల జీతం రూ.40 వేలు.. ఆ పైసలు హైదరాబాద్‌లో ఇంటి కిరాయి, ఇతర ఖర్చులకు ఏటూ సరి పోయేవి కావు. భవిష్యత్ ఆలోచిస్తే భయమేసేది. అప్పటికే పిల్లల చదువులకు అయిన అప్పులు కుప్పలుగా పెరిగి పోతున్నాయి. నా బిడ్డి మల్లిక పెళ్లి శ్రేయోభిలాషుల సహకారంతో 13 ఆగస్టు 2020లో చేశాను. జర్నలిస్ట్ గా రాజీనామా చేసే నాటికి నా అప్పులు రూ.50 లక్షలు. జర్నలిస్ట్ గా ఎంత కాలం పని చేసినా.. అప్పులు ముట్టవనిపించింది.. రాజీనామా చేసి బయట పని చేయాలంటే నాకు మరో పని తెలియదు. అప్పులు ముట్ట చేయడానికి నిజామాబాద్‌లోని 80 గజాల ఇల్లును రూ.21 లక్షలకు అమ్మేశాను. ఆ సమయంలోనే చార్టెడ్ అకౌంట్ సత్యనారాయణ పరిచయం కావడం నా జీవితంలో టర్నింగ్ ఫాయింట్.
ప్రతి మనిషికి టార్నింగ్ ఫాయింట్ తప్పకుండా వస్తోంది. మనం చేసే మంచి పనులు మనకు జీవితంలో అండగా ఉంటాయి. ఏడాది క్రితం పరిచయమైన చార్టెడ్ అకౌంట్ సత్యనారాయణ మరో ఫ్రెండ్ ద్వారా నా గురించి తెలుసుకుని ‘నెలకు రూ.50 వేల గౌరవ వేతనంగా ఇస్తాను.. నీ పరిచయాల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి చేద్దాం.. అందులో వచ్చే లాభంలో కూడా పర్సెంటేజ్గా ఇస్తా’ అన్నారు. అంతే క్షణం ఆలోచించకుండా జర్నలిస్ట్ గా రాజీనామా చేశాను. ఆయన సహాకారంతోనే అప్పులన్నీ కట్టేశాను. నేను జర్నలిస్ట్ గా మానేయ్యడం వల్లే అప్పులు లేకుండా ప్రశాంతంగా బతుకు వెళ్ల తీస్తున్నాను.
ఆత్మీయులు.. అనుబంధం..
జర్నలిస్ట్ జర్నీలో గోపరాజు నాగేశ్వర్రావు మొదటి గురువు.. ఆ తర్వాత ఈ జర్నీలో చాలా మంది ఆత్మీయులను సంపాదించుకున్నా. బైస రామదాస్, బాల గంగాధర్, వి.పి.ఎస్ రాజు, పిట్టెల రవీందర్, ఎస్ జీవి.శ్రీనివాస్‌రావు, తెలిదేవర భానుమూర్తి, పి.లింగం, రవి ప్రతాప్ చావ్లా, సిర్ప గంగాధర్, ఖాలీక్, సేపూరి వేణు గోపాల్ చారి, ఇస్మాయిల్ ఇలా చాలా మందే ఉన్నారు. అయితే.. వీ6 న్యూస్ సీఈవో అంకం రవి గారితో సుదీర్ఘంగా 13 ఏళ్ల అనుబంధం ఉంది. జీవితంలో నేను మరిచి పోలేని వ్యక్తి జర్నలిస్ట్ స్వర్గీయ బి.విజయానంద్. నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నా కుటుంబానికి ఆయన ఎంతో భరోసారా ఇచ్చారు. నా బాధలను పంచుకున్నాడు. ఇకపోతే.. సత్యనారాయణ ( చార్టెడ్ అకౌంట్), గడ్డం శ్రీధర్‌రెడ్డి (బిజినెస్ మెన్) మామిడి నారాయణ (లెక్చరర్), డాక్టర్ శ్రీనివాస్, మానస గణేశ్ ( ప్రైవేట్ స్కూల్), హరిచరణ్, మాసం వెంకటేశ్వర్ గౌడ్ సహాకారం ఎప్పటికీ మరువలేను.. ఇక దేవేష్ నాకు సోదరుడు కావడం కూడా అదృష్టం..
ముగింపు..
జర్నలిస్టు యాటకర్ల మల్లేష్ అన్న.. స్వీయ రచనలు రాయడంతో ప్రజల ఆదరణ పొందాయి. గాయపడ్డ సూరీడు ( నా ఆటోగ్రాఫ్ ), తెలంగాణ ఉద్యమం (తెలంగాణ పోరు), నక్సల్స్ ఇంటార్వ్యూలు (అన్నలతో ఒకరోజు), గల్ఫ్ బాధితుల బాధలు (దుబాయ్ జర్నలిస్ట్ టూర్), డబ్బు కోసం.. (ఓ జర్నలిస్ట్ కథ), కిడ్నాప్ (నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే) ఇలా… కల్పితం లేకుండా జర్నలిస్ట్ జర్నీలో కనిపించిన సంఘటనల ఆధారంగా ఎన్నో పుస్తకాలు రాశారు. అయితే నేను ‘వీ6 వెలుగు’లో సబ్ ఎడిటర్‌గా జాయిన్ అయినప్పుడు మల్లేశన్న నేను ఒకే డెస్క్ లో కూర్చునే వాళ్లం. ఉదయం ఆయన వచ్చి సేకరించిన వార్తలను టైప్ చేసుకునే సిస్టమ్‌పైనే నేను సాయంత్రం 4 గంటలకు వెళ్లి పనిచేసుకునే వాడిని.. అలా కొన్ని సందర్భాల్లో అన్న నేను వెళ్లే వరకూ సిస్టమ్ మీదే ఉండేవారు. అలా బాండింగ్ మొదలైంది.. వయసులో నాకంటే చాలా పెద్దవారైనా ఎప్పడూ ఆ వ్యత్యాసం కనిపించేది కాదు. నిరాడంబరుడు, మృదుస్వభావి.. ఎవరినైనా సరే అన్నా.. తమ్మీ అంటూ అప్యాయంగా పిలుస్తారు. అయితే కొన్ని రోజులకు డెస్క్ ఆయన కనిపించడం మానేశాడు. ఏ మైందని ఆరా తీస్తే తెలిసింది. మల్లేశన్న ఉద్యోగానికి రాజీనామా చేశాడని తెలిసింది..
.. ఫోన్ చేస్తే.. ‘నా సమస్యల కారణంగా మానేశా తమ్మీ అన్నాడు..’ ఆ తర్వాత కొద్ది రోజులకు నేను ‘చౌరాస్తా’ మొదలు పెట్టాను.. దానిని చూసి తమ్మీ నేనూ ఓ శీర్షక రాస్తా పెట్టుకుంటావా అన్నాడు. నేను ఓకే అనడంతో ‘నక్సల్స్ తో ఒక రోజు..’ అంటూ ఓ సిరీస్ రాశారు. అదే సమయంలో మల్లేశన్నతో మరింత చనువు ఏర్పడడంతో అన్న జర్నీని వివరించారు. అప్పుడే అనుకున్నా మల్లేశన్నను ‘కొత్తదారిలో పాతమిత్రులు’లో పరిచయం చేయాలని. అది ఇప్పటికి తీరింది.
చివరగా.. ఇంటర్య్వూ అంగా పూర్తయ్యాక.. ‘ అన్న 58 ఏళ్ల వయసున్న మీరు ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉంటారు.. ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారా.. ఎంతో హ్యాపీగా ఎలా ఉంటారు.. ఆ సీక్రెట్ ఏంటన్నా.. అంటే’.. నవ్వుతూ.. సిద్ధ సమాధి యోగ వ్యవస్థాపకుడు రుషి ప్రభాకర్ గురూజీ యోగ అంటారు. అది నాకు యోగ గురూజీ రత్నాకర్ గారు నేర్పించారని చెప్పారు.‘ మొత్తానికి జర్నలిస్టు నుంచి రియల్టర్ ఎదిగావన్న’ అంటే మాత్రం.. ‘ఎంత ఎదిగినా జర్నలిస్ట్ జిందగీని వదులుతామా తమ్మీ..’ నవ్వేశాడు మల్లేశన్న..
– ఉప్పలంచి నరేందర్, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్
Bro..Happy Sankranthi. Senior journalist Malleshanna story bhagundi