– ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మభిక్షం
జనగామ, మన చౌరాస్తా : దేశ వ్యాప్తంగా నీట్ సమస్యతో 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు చిక్కుల్లో పడితే ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ భిక్షం విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీని దేశ ప్రజలు మూడో సారి ప్రధానిగా ఎన్నుకుంటే కనీసం ప్రజల సమస్యలను ఎలాగూ పట్టించుకోరు, విద్యార్థులపై కూడా అదే చిన్న చూపు చూడడం బాధాకరం అన్నారు. వైద్య విద్యలో ఇంత పెద్ద అవినీతి జరగడం, దీనిలో అధికారుల పాత్ర కూడా ఉందని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు పరిధిలో నీట్ పరీక్ష అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ విద్యార్థులపై స్పందించకపోవడం ఏ మాత్రం కూడా విద్యార్థులు సహించ బోరని, పదో తరగతి ప్రశ్నపత్రం లికేజ్ లో జరిగినపుడు బండి సంజయ్ విద్యార్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, కానీ ప్రస్తుతం దేశం మొత్తం నీట్ సమస్య వినపడ్తున్న ఏమాత్రం కూడా సోయిలేనట్టు వ్యవహరిస్తున్న బండి సంజయ్ కి తప్పకుండా విద్యార్థులు బుద్ధి చెబుతారన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా మళ్లీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని ఉమా, జిల్లా సహాయ కార్యదర్శి యకాన్న రాథోడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యూనస్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్యా తదితరులు పాల్గొన్నారు.