ఐదు వాయిదాల కరువు భత్యం(డిఎ) పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం ఒక్క వాయిదాని మాత్రమే విడుదల చేయడం విచారకరం. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో బకాయి పడిన మూడు వాయిదాల డిఎ విడుదల చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థం చేసుకుని గత పదినెలలుగా ఓపిక పట్టారు. తదుపరి మరో రెండు వాయిదాలు బకాయి పడడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. వినిమయ ధరల సూచీకి అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించబడుతుంది. గత కొన్నేళ్ళుగా రాష్ట్రంలో ఈ ఆనవాయితీని పాటించటం లేదు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా పండుగలప్పుడు కానుకలుగా ఇస్తున్నట్లు ప్రకటించటం విడ్డూరంగా ఉంది. ఉద్యోగుల జెఎసితో సిఎం జరిపిన చర్చల అనంతరం కనీసం రెండు వాయిదాల డిఎ అయినా ఇప్పుడు ఇస్తారని ఉద్యోగులు భావించారు. మంత్రివర్గం నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ ఒక్క వాయిదా డిఎ మాత్రమే విడుదల చేయటంతో ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం పెట్టే ఖర్చులన్నీ పెడుతూనే ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన డిఎలకే ఆర్థిక పరిస్థితి ఆటంకమౌతుందా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ కోరుతున్నది.