
పాలకుర్తి, మన చౌరాస్తా : విద్యార్థులే రాజకీయ నాయకులయ్యారు. ఒకరు సీఎం, మరొకరు డిప్యూటీ సీఎం, ఇంకొకరు ప్రతిపక్ష నేత.. మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు. వారి మధ్య వాద ప్రతివాదాలు.. ఆలోచింపజేసే చర్చలు.. వీటన్నింటికీ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో శనివారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ వేదికగా నిలిచింది. పాఠశాల ప్రిన్సిపాల్ జె.రవీందర్, కరస్పాండెంట్ జె.ఊర్మిళ నేతృత్వంలో 9వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ గా పి. శివప్రసాద్, సీఎంగా కె.అఖిల్, స్పీకర్ గా ఆర్. హర్షిణి, డిప్యూటీ సీఎంగా ఎల్. సుప్రియ, ప్రధాన ప్రతిపక్ష నేతలుగా మెరుగు అభినయ్ రామ్, వేణు, వివేక్, కె.యశ్వంత్ వ్యవహరించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. నిజమైన నాయకుల్లా మాట్లాడుతూ వివిధ అంశాలపై చర్చించారు. వారి మధ్య జరిగిన వాద ప్రతివాదాలు చూపరులను కట్టిపడేశాయి. లెక్కలతో సహా వారు మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. నేటి బాలలే రేపటి నాయకులు అన్న చందంగా కార్యక్రమం ఆద్యాంతం విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారికి శిక్షణ ఇచ్చిన సోషల్ టీచర్ బి. వెంకట సోములు, ఇతర టీచర్లు, సిబ్బందిని పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ అభినందించారు.