- గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి
- కాంగ్రెస్‌వి 420 హామీలు
- రైతు రుణమాఫీపై స్పష్టత ఏదీ?
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, (చౌరాస్తా ప్రతినిధి) : ‘తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సైకి ఇంగితజ్ఞానం ఉందా..! హాదాకు తగినట్టు వ్యహరించాలి.. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా..! అసలు గవర్నర్ వ్యవస్థతో డబ్బులు ఖర్చు తప్ప వేరే ఉపయోగం లేదు.. ఈ వ్యవస్థను రద్దు చేయాలని స్వీర్గీయ ఎన్టీ రామారావు ఏనాడో అన్నాడు..’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను కడియం త్రీవంగా ఖండించారు. గవర్నర్ తన హోదా మరిచి మాట్లాడుతన్నరంటూ మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఆయన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ తమిళ సై తను ఒక గవర్నర్ అని మర్చిపోయి గణతంత్ర వేదికను ఒక రాజకీయ వేదిక లాగా మాట్లాడటం చాలా బాధాకరం అన్నారు. గత ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయి, సరిగ్గా పని చేయలేదని అనడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం ఉన్న గవర్నర్ రాజ్యాంగ బద్ధ హోదాలో ఉండి పని చేయాలి తప్ప ఇలా విమర్శించడం సరికాదన్నారు. గవర్నర్ ఈ రోజు ఒక బీజేపీ ప్రతినిధిగా మాట్లాడినట్లు తాము అనుకుంటున్నామని, ఆమె వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోందన్నారు. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు రక్షించాల్సిన గవర్నర్ ఈ విధంగా మాట్లాడడం ఆమె అవివేకానికి నిదర్శనమని కడియం విర్శించారు. రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారిని గవర్నర్ చేస్తే ఏ విధంగానే ఉంటుందని ఎద్దేవా చేశారు.
420 హామీలు ఇచ్చి..
కాంగ్రెస్ దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే కడియం ఆరోపించారు. అధికారంలోకి వచ్చి సుమారు 50 రోజులైందని, ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కేవలం 2 హామీలు మాత్రమే అమలు చేసిందన్నారు. మిగతా హామీల పరిస్థితి ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతులు ఎవరైనా పంట రుణాలు తీసుకోని వారు ఉంటే బ్యాంకుకు వెళ్లి తీసుకోండి.. డిసెంబర్ 9 న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది.. తాను సీఎం అయ్యాక రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించడం లేదన్నారు.
రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అని మర్చిపోయి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ను బొంద పెడుతా.. కేఆర్ఎస్ చార్లెస్ శోభారాజ్.. కేటీఆర్, హరీశ్ రావులను బిల్లా రంగలు..’ అంటూ కార్యకర్తలు, నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అసలు రేవంత్‌రెడ్డి చరిత్ర ప్రజలందిరికీ తెలుసని, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలుసన్నారు. ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవుపలికారు. రానున్న రోజుల్లో ఎంపీ బీఆర్ఎస్ సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు.
సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్, బీఆర్ఆర్ సీనియర్ నేత పసుల ఏబేలు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సింహులు, కౌన్సిలర్ పేర్నీ స్వరూప, నాయకులు తిప్పారపు విజయ్, ఉల్లెంగుల సందీప్ తదిరులు పాల్గొన్నారు.