
- బీఆర్ఎస్ కార్యకర్తలకు కడియం బెదిరింపులు
- అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుండు
- ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
- ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు
- మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, నియోజకవర్గంలో కడియం రాక్షస పాలన కొనసాగిస్తున్నాడని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. గురువారం జిల్లాలోని యశ్వంతాపూర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో రాజయ్య విలేకరులతో మాట్లాడారు. కడియం శ్రీహరి గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి అప్రజాస్వామిక పాలన కొనసాగించాడని, ఎన్కౌంటర్లతో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. నాటి అప్రజాస్వామిక పాలనను ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తున్నాడన్నారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమపడి కడియంను గెలిపిస్తే.. నమ్మిన వారిని నయవంచన చేసి పార్టీ మారడం సిగ్గు చేటన్నారు. ఊసరవెళ్లి రంగులు మార్చిన విధంగా కడియం పార్టీలు మార్చాడని ఆయన చరిత్రను గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన వెంటనే బీఆర్ఎస్ లీడర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ప్రశిస్తే కేసులే..
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వెళ్లిన కడియంను రాజీమానా చేయాలని డిమాండ్ చేసిన వారిని, అభివృద్ధిపై ప్రశ్నించిన వారిపై ఆయన తన అనుచరణ గణంతో అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని తాటికొండ ఆరోపించారు. అలా ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ కోఆర్డినేటర్ కేసీరెడ్డి మనోహర్‌రెడ్డిపై కేసు పెట్టించి అరెస్టు చేయించాడన్నారు. నియోజకవర్గంలో ఆరుగురిపై కేసులు పెట్టించి కడియం రాక్షస ఆనందం పొందుతున్నాడన్నారు. కడియం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి కూడా ‘ఉరికిచ్చి కొడుతా.., గుడ్లు పీకేస్తా.., లాగులో తొండలు తొడుగుతా.., వీపు విమానం మోతమోగిస్తా..’ అంటూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడని, ఒక సీఎంకు ఇంటి భాషా విధానం ఉండడం సిగ్గు చేటన్నారు.
ఇది 420 ప్రభుత్వం..
ఎన్నికల ముందు అములుకు నోచుకుని 400 పైగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోని వచ్చి 420 రోజులైందిని, కానీ అందులో ఒక్కటి కూడా సరిగా అమలు చేయడంలేదని రాజయ్య విమర్శించారు. అందుకే నేడు గాంధీ వర్ధంతిని సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఈ 420 సర్కారుపై వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.
టింగు టింగు లేదు.. బొంగు లేదు..!
జనవరి 26న నాలుగు పథకాలు ఇస్తామని, అర్ధరాత్రి నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయని, రైతుల ఫోన్లు ‘టింగ్ టింగ్’ మంటాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాడని.. కానీ ఇప్పటి వరకు ‘టింగ్ టింగ్ లేదు.. బొంగు లేదు..’ అని తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌ను విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కోతలు, ఎగవేతల ప్రభుత్వం అన్నారు. ఉమ్మడి వరంగల్ జల్లాకు ఇప్పటి వరకు రూ.89 కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను గుర్తించే స్థానిక సంస్థ ఎన్నికలను వాయిదా వేసుకోవాలని కుట్ర చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు వస్తే జనం కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెడతారని రాజయ్య అన్నారు. సమావేశంలో కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ జడ్పీటీసీ మారపాక రవి, నాయకులు చౌదరపల్లి శేఖర్, రావుల తిరుమల్‌రెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు.