-
- అడ్డు వచ్చిన మరో మహిళపై దాడి
- గొడ్డలితో గ్రామంలో హల్ చల్
- పోలీసులు రావడంతో పరారీ
రేగొండ, చౌరాస్తా : జయశంకర్ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. సైకో వీరంగంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజిరెడ్డి గురువారం రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో తన తల్లి కంచరకుంట్ల హైమావతిని గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపాడు.
గోడువను చూసి బయటికి వచ్చిన ఇంటి పక్కన ఉన్న ఊకంటి లలితపై దాడి చేయగా తీవ్ర గాయాలై చావుబతుకుల మధ్య ఉంది. చికిత్స నిమిత్తం ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిని చంపి ఇంటి పక్క వారిపై దాడి చేసి పారిపోతుండగా గోరుకొత్తపల్లి మండలం చిన్నకోడపాకలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజిరెడ్డిని ఆ గ్రామస్తులు దొంగగా భావించి పట్టుకొని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.