
- రెండు వేల పెట్టెల బీర్లు నేలపాలు..
భీమదేవరపల్లి, మన చౌరాస్తా : లిక్కర్ లారీ బోల్తాపడి 25 లక్షల విలువగల రెండు వేల పెట్టెల బీర్లు నేల పాలైన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామ శివారు సమ్మక్క సారలమ్మ కల్వర్టు వద్ద చోటుచేసుకుంది. సంగారెడ్డి నుంచి బయలుదేరిన రూ.25 లక్షల విలువగల బీర్ల లోడుతో వెళ్తున్న లారీ హనుమకొండ ప్రధాన రహదారి ముల్కనుడు సమ్మక్క సారలమ్మ కల్వర్టు వద్దకు రాగానే కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. బుధవారం వేకువ జమన ప్రమాదం జరగడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసుల సమన్వయంతో పరిస్థితులను చక్కబెట్టారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. కాజీపేట ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్ఐ తిరుపతి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.