స్టేషన్ ఘన్ పూర్, చౌరాస్తా :జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామ శివారు వ్యవసాయ మార్కెట్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టిన ప్రమాదంలో విశ్వనాథపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం నరసింహ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని విశ్వనాధపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం నరసింహ వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం రాత్రి మండల కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరసింహ మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.