- అప్పుడు.. ఇప్పుడూ దొంగ ఓట్లతోనే గెలిచిండు
- ఆయన వల్లే మళ్లీ ఉప ఎన్నికలు..
- మళ్లీ ఓటు అడిగే హక్కు ‘పల్లా’కు లేదు
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
జనగామ, మన చౌరాస్తా ప్రతినిధి : ‘జనగామ ప్రజలను చెరువులో నుంచి తీసి బావిలో వేసినట్టు అయ్యింది.. ఇంతకాలం ఉన్న ముత్తిరెడ్డి పోయిండు అనుకుంటే.. మల్లా గీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వచ్చాడు.. దొంగ ఓట్లతో గెలిచిన ఆయన మీకు ఎమ్మెల్యే కానేకాదు.. ఓడినా నైతికంగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యే..’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం వచ్చే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మూడు ఉమ్మడి జిల్లాలకు ఉన్న ఎమ్మెల్సీ పదవిని ఎందుకు వదిలేశాడో చెప్పాలని ప్రశ్నించాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మల్యే అని, గతంలో ఎమ్మెల్సీగా దొంగ ఓట్ల గెలిచాడని ఆరోపించారు. పల్లా మంత్రి అవుతాననే ఆశతో జనగామకు వచ్చాడన్నారు. ఈయన దెబ్బకు సొంత పార్టీలోని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డే పత్తలేకుండా పోయాడని, ఇక మీరెంత అని అన్నారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామలో ఓడి పోవచ్చు కానీ, జనగామ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే అంటూ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబంతో పాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఆశీర్వదించండి.. అండగా ఉంటా..
పట్టభద్రులు తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని, మీ ఓటును వృథా చేయకుండా ఎల్లప్పుడు అండగా ఉంటానని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పోతుందన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు లిస్ట్ ప్రకారం ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. బీఆర్ఎస్ ప్రచారం పెద్ద అమ్మలోళ్లు చేసినట్లు ఉన్నదని, వాళ్లను వాళ్లే కొట్టుకుంటున్నారని, ఇక బీజేపీ అభ్యర్థి ముసలాయన అని, ఆయన నల్గొండ పోయే వరకు ఎన్నికలు అయిపోతాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తనపై కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. తనకు ఓటు వేస్తే ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పని చేస్తానని మల్లన్న పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల జనగామ జిల్లా సమన్వయకర్త భవానీరెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి పద్మ, టీపీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు గిరి కొండల్‌రెడ్డి, నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్, జనగామ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, సీనియర్ నేత డాక్టర్ రాజమౌళి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షడు అభిగౌడ్, నాయకులు వంగాల మల్లారెడ్డి, జక్కుల వేణుమాధవ్, బొట్ల నర్సింగరావు, జనగామ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)