- గంటల వ్యవధిలో అక్కాతమ్ముడి మృతి
- నెల్లుట్లలో విషాదం
అక్క అంటే ఆయనకు ఆప్యాయత.. తమ్ముడంటే ఆమెకు ప్రాణం.. ఏళ్లు గడిచినా.. ఎక్కడున్నా వారి ఆత్మీయత తరిగిపోలేదు.. అకస్మాత్తుగా తమ్ముడు ఆకాల మరణం చెందడం.. ఆ అక్క తట్టుకోలేకపోయింది. ఇంటి ముందు నిర్జీవంగా ఉన్న తమ్ముడి మృతదేహాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది.. ఆ ఏడుపులోనే ఆమె గుండె ఆగింది.. గంటల వ్యవధిలో అక్కా తమ్ముడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో జరిగింది.
లింగాలఘణపురం, మన చౌరాస్తా : లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన గాడిపల్లి శంకర్ (52) బట్టల దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన బుధవారం మృతి చెందాడు. విషయం తెలిసిన శంకర్ అక్క కుడికాల రుకుంబాయి (54) ఆయన అంత్యక్రియలకు వచ్చింది. ఇంటి ముందు నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి ఆమె తట్టులేకపోయింది. మృతదేహంపై పడి బోరున విలపించింది. అలా ఏడ్చుకుంటూ స్పృహ కోల్పోయింది. స్థానికులు, బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గంటల వ్యవధిలో అక్కా, తమ్ముడు మరణించడంతో నెల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం సాయంత్రం శంకర్ అంత్యక్రియలు పూర్తి కాగా గురువారం ఆయన సోదరి రుకుంబాయి
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐదుగురిలో.. ఆ ఇద్దరు..
నెల్లుట్ల గ్రామానికి చెందిన గడిపల్లి లక్ష్మి, నర్సయ్యలకు ఐదుగురు సంతానం. ఇందులో దేవి, రుకుంబాయి, లక్ష్మి, బాలమణి, పుష్పమ్మ నలుగురు కుమార్తెలు. కుమారుడు శంకర్ అందరికంటే చిన్నవాడు. చిన్ననాటి నుంచి అక్క రుకుంబాయి, శంకర్ మధ్య అనుబంధం అందరికంటే భిన్నంగా ఉంటేదని బంధువులు పేర్కొన్నారు. ఒకరంటే ఒకరికి ఏంతో ప్రేమ ఉండేదని చెప్పారు. రుకుంబాయి వివాహం తర్వాత భర్త కొన్ని రోజులు సోలాపూర్ వెళ్లి వచ్చి మరణించారు. ఆయన మరణం తర్వాత ఆమె నెల్లుట్లలోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఇక బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్న శంకర్ కొన్ని రోజు కింద పక్షవాతంతో అనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి మరణించాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.