హైదరాబాద్, మన చౌరాస్తా : సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా డీఈడీ, బీఈడీ అర్హతలతో నియామకమైన ఉపాధ్యాయులందరికీ సీనియారిటీ ప్రకారం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి అవకాశం కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. జీవో నెంబర్11, 12 లను సవరించాలని, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పది వేలకు పెంచుతామని గత సీఎం అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 5,571 పీఎస్ హెచ్ఎం పోస్టులు తక్షణమే మంజూరు చేయాలని కోరింది. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతుల్లో ఒక ఎస్జీటి ఉపాధ్యాయునికి బహుళ సబ్జెక్టుల్లో పదోన్నతి అర్హత ఉంటే సీనియారిటీ ప్రకారం వెబ్ కౌన్సెలింగ్ లో అన్ని సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తున్నారని, దీని వలన సీనియారిటీలో దిగువన ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు పదోన్నతి కోల్పోతున్నారని టీఎస్ యూటీఎఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరికి ఒక సబ్జెక్టులో మాత్రమే పదోన్నతి ఇచ్చి మిగిలిన సబ్జెక్టుల్లో పేరు తొలగించి కోరారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.