Warangal Desk Journalist : ఇమడలేకపోయా..
కరోనా నేపథ్యంలో చాలా రోజులుగా మా పిల్లలను బయటకు తీసుకెళ్లలేదు. వాళ్ల పోరు భరించలేక గత వారం వీక్ఆఫ్ రోజున సాయంత్రం మా (ఉప్పల్‌లో) రోడ్డవతల ఉన్న బేకరీకి తీసుకెళ్లాను. బేకరీ ముందు ఉన్న ఫాస్ట్‌ఫుడ్ టేబుల్‌పై ‘టంగ్.. టంగ్’ అంటూ.. ఒకాయన గంటె తిప్పుతూ.. ఎగ్ నూడుల్స్ వేస్తున్నాడు. పక్కనే చైర్స్పై ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ కూర్చున్నారు. మేం సరాసరి బేకరీ లోపలికి వెళ్లాం. కౌంటర్ మీద ఎవరూ లేరు. మా పిల్లలు అద్దాల్లోంచి చూస్తూ కేక్‌లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.. ‘హలో.. భయ్యా.. ఎవరూ లేరా..’ అంటూ పక్కనే నూడుల్స్ వేస్తున్న అతడి వైపు చూస్తూ.. అడిగాను.. ఇంతలో ‘ఆ సార్ చెప్పండి..’ అంటూ కౌంటర్ కింద రాక్‌లో ఏదో తీస్తూ ఓ వ్యక్తి పైకి లేచాడు.. నేను షాక్.. అయ్యా..! కానీ అతడి ముఖంలో ‘సంతోషం’ కనిపించింది. ‘అన్నా.. బాగున్నారా..’ అంటూ మరోసారి పలకరించాడు. ఇంతలో షాక్ నుంచి తేరుకుని.. ‘హాయ్.. ఏంది నువ్వు ఇక్కడ..’ అన్నాను. అతను నవ్వుతూ ‘ఈ షాపు నాదే అన్నా..’ అన్నాడు. అది విన్న మా పిల్లలు ‘హే.. షాపు అంకుల్ డాడీ వాళ్ల ఫ్రెండ్ అంటా..’ సంబుర పడ్డారు. వారికే కాదు నాకు అంతే సంబురమేసింది.. ఎందుకో మీకు అర్థమైందనుకుంటా.. నా ఎదురుగా నిలుచున్నది నాతో కలిసి పనిచేసిన ఓ ‘సబ్ ఎడిటర్’.. (Wgl Desk Journalist ) కప్పల సంతోష్.. అర్ధరాత్రి నౌకరి వదిలి బేకరీ పెట్టుకుని ఇప్పడు బిందాస్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన పెట్టుకున్నది చిన్న షాపే అయినా సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తూ మరో ఇద్దరికి ఉపాధిని ఇస్తుండడం నాకు గ్రేట్ అని పించింది.. అందుకే ఆ బిజినెస్ మ్యాన్‌ను చౌరాస్తాలోకి తీసుకొచ్చాను.. పదండి మరి ఆ మాటాముచ్చట ఏంటో తెలుసుకుందాం..
హాయ్.. సంతోష్ ఏంటీ ఈ కొత్త దారి..?
(నవ్వుతూ..) కొత్త దారి ఏమీ లేదన్న.. దాదాపు రెండేళ్లుగా నాది ఇదే దందా.. మీరు ఇప్పడు చూశారు కాబట్టి మీకు కొత్తగా ఉంది.
మొత్తానికి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యావు. మరో ఇద్దరికి ఉపాధి ఇస్తున్నావు బాగుంది.
బతకడానికి ఏదో ఒకటి చేయాలిగా అన్న. అందుకే ఈ దందా. నేను బతుకుతూ నా వద్ద పనిచేసే వాళ్లకు ఏదో నాకు తోచింది ఇస్తున్నా.
జర్నలిజంకు ఎంతో ఇష్టంగా వచ్చావు.. మరి ఎందుకు మానేశావు..?
అవునన్నా.. ఎంతో ఇష్టంతో సాక్షి జర్నలిజం ఎగ్జామ్ రాశా. సెలక్ట్ అయ్యా. సబ్ ఎడిటర్ నౌకరి సాధించా. కానీ అక్కడ ఇమడలేకపోయా.. (నవ్వుతూ..) ‘ఎందుకు’.. నీకు తెలియందా అన్న. ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో దానిలో ఇమడడం అంతే కష్టం. అందులో మనది ప్రకృతి విరుద్ధమైన జాబ్..
హేహే.. అసలు విషయం చెప్పు?
(నవ్వుతూ..) చెప్పేది ఏముందన్న. అంతా నీకు తెలిసిందేగా. నేను పనిచేసిందే 6 నెలలు నాకు ఏం అనుభవాలు ఉంటాయి. కాకుంటే ట్రైనింగ్‌లో ఉన్న రోజులకు డెస్క్ ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అందుకేమో నేను అక్కడ ఇమడలేకపోయా.. ఏమైనా దాని వల్ల నాకు మంచే జరిగింది.
మీడియా వైపు ఎలా వచ్చావ్..?
మాది తొర్రూరులోని అన్నారం గ్రామం. అన్నారం అంటే మీకు తెలిసే ఉంటది అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ సమయంలో అక్కడి జర్నలిస్టుల హవా అంతా ఇంతాకాదు. వారికి మర్యాదలు కూడా అలాగే ఉంటాయి. నేను 2014లో ఎంబీఏ పూర్తి చేశాను. తర్వాత తొర్రూరులోనే చిన్నాచితక జాబ్స్ చేశాను. అప్పట్లో విలేకరులను చూసి గర్వంగా ఫీలయ్యే వాడిని. వాళ్లకు అన్ని విషయాలు తెలుస్తాయి. వారిని అందరూ గౌరవిస్తారు.. అనే భావన ఉండేది. అలా నా మనసు జర్నలిజం వైపు మళ్లింది. 2017 చివరలో అనుకుంటా సాక్షి జర్నలిజం నోటిఫికేషన్ పడడంతో ఎగ్జామ్ రాశా. సెలెక్ట్ అయ్యా. అలా మీడియా రంగంలో అడుగు పెట్టాను. హైదరాబాద్‌లో దాదాపు 8 నెలలు కోచింగ్ ఇచ్చారు.
నీ మొదటి పోస్టింగ్ ఎక్కడా?
(నవ్వుతూ..) నా మొదటి పోస్టింగ్.. చివరి పోస్టింగ్ రెండూ వరంగల్ జిల్లానే.. 2018లో వరంగల్ యూనిట్లో నేను, నాతో పాటు ప్రవీణ్, రంజిత్‌రెడ్డి ముగ్గురం రిపోర్ట్ చేశాం. ట్రైనింగ్‌లో వాతావరణానికి డెస్క్‌లో పరిస్థితులకు చాలా భిన్నంగా ఉండేవి. ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ తీసుకున్నప్పుడు మేం ఎంతో సంబురపడ్డాం. సొంత జిల్లాకు వెళ్తున్నామని కింగుల్లా ఫీలయ్యాం. మేం అక్కడ పని చేస్తే ఇక్కడ సార్లు చూసుకుంటారని అకున్నాం. కానీ, అక్కడి వెళ్లాక తెలిసింది. మా పైన అక్కడ ఓ బాస్ ఉంటాడని.. మాకు వరంగల్‌లో పెరుమాండ్ల కిశోర్ సార్ బాస్.. సార్, తనతో పనిచేసే సహుద్యోగులు, సిబ్బందితో ఎంతో సరదాగా ఉంటారు. కానీ, పని విషయానికి వస్తే అంతే స్ట్రిట్‌గా ఉంటారు.
సాక్షిలో అనుభవాలు..
(నవ్వుతూ..) అన్నానేను ముందే చెప్పాను. నేను చేసిందే 6 నెలలు నాకు అనుభవాలు ఏముంటాయి. కాకుంటే సబ్ ఎడిటర్ జాబ్ అనేది కత్తి మీద సామే.. కాలంతో పరిగెడుతూ పని చేయాలి. ట్రైనింగ్ టైంలో 5 గంటలకు రూంకు వెళ్లి హాయిగా ఉండే వాళ్లం. కానీ, డెస్క్ లోకి వచ్చాక రోజూ అర్ధరాత్రి ఒంటి గంట అయ్యేది. అలా చాలా ఇబ్బంది పడ్డా.. ఇక పని విషయానికి వస్తే కొత్త వాళ్లం కదా మా అంతగా ఒత్తిడి ఉండేది కాదు. కానీ, మేం వచ్చిన కొన్ని రోజులకే మీరు, మీ తర్వాత మరో ముగ్గురు మానేశారు. దాంతో డెస్క్ లో ఉన్న వారి మీద పని ఒత్తిడి పెరిగింది. ఒక్కొక్కరికీ రెండు జోన్లు ఇచ్చేవారు. ఇంకా కొంచెం సీనిర్లయితే మూడు జోన్లు కూడా చూడాల్సి వచ్చేది. నా వరకైతే సీనియర్లయిన కొమ్ము రాజు, రఘుపతి, బొమ్మగాని శ్రీకాంత్, మానిక్ లాంటి వారు సాయం అందిచేవారు..
ఒకటి మాత్రం మర్చిపోను ఓ సారి నాకు రెండు జోన్లు ఇచ్చారు. ఒక్కో జోన్‌కు దాదాపు 40 నుంచి 60 వార్తలు వస్తాయి. నేను కొత్తవాడిని కావడంతో కొంత ఇబ్బంది పడ్డాను. ఆ రోజు నా పేజీలు పూర్తయ్యే తెల్లవారుజాము మూడైంది. ఆ సందర్భంలోనే డిసైడ్ చేసుకున్నా ఈ జాబ్‌కు నేను సెట్ అవ్వనని. అందుకే మానే బయటకు వచ్చా..
ఈ బిజినెస్ వైపు ఎలా వచ్చావు..?
ఉద్యోగం మానేయాలనుకున్నప్పుడే బిజినెస్ వైపు ఆలోచనలు మొదలు పెట్టాను. అప్పటికే ఉప్పల్‌లో ఉన్న మా బ్రదర్ బేకరీ బిజినెస్ గురించి చెప్పాడు. మంచి అడ్డా ఉంది రమ్మన్నాడు. అలా ఇక్కడికి వచ్చాను. మొదట కొన్ని రోజులు ఇబ్బంది పడినా తర్వాత షాపు పుంజుకుంది. ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరు ఉపాధి పొందుతున్నారు.
ఈ లైఫ్ ఎలా ఉంది..?
నా పేరులోనే సంతోషం ఉందన్న. నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటా. ఇక్కడా అలాగే ఉన్నా. ప్రస్తుతం వర్క్స్ జీతాలు, షాపు మెయింటన్స్ పోను నెలకు రూ.40 వేల వరకు సంపాధిస్తున్నా. కరోనా టైంలో కాస్త ఇబ్బంది పడ్డా. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టపోయా. ఇప్పుడిప్పుడే మళ్లీ గిరాకీ పెరుగుతోంది. హ్యీపీగానే ఉన్నా..
ముగింపు…
కప్పల సంతోష్ గౌడ్.. (Wgl Desk Journalist ) వరంగల్ సాక్షి యూనిట్లో అతి తక్కువ కాలం పని చేసిన డెస్క్ జర్నలిస్ట్.. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులోని అన్నారానికి చెందిన సంతోష్ ఎంబీఏ చేశాడు. సంతోష్ నాన్న గారు రంగయ్య ఆర్టీసీ డ్రైవర్.. ఉన్న దాంట్లో కొడుకును బాగా చదివించారు. ఉన్నత చదువు చదివిన సంతోష్ మంచి కొలువు చేస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టే ఆయన ప్రయత్నాలు చేశాడు. కానీ, ఫలించలేదు. ఇప్పడు ఇలా కొత్త దారి ఎంచుకుని మంచి బిజినెస్ మ్యాన్‌గా ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఆయన లైఫ్ మరింత సక్సెస్ ఫుల్‌గా సాగాలని ఆశిద్దాం..
కష్టకాలంలో ఆటో నడిపిన డెస్క్ జర్నలిస్ట్
1 thought on “Warangal Desk Journalist : ఇమడలేకపోయా..”