
- అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మన చౌరాస్తా, మహబూబాబాద్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ ఐడీవోసీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యేలు మురళీనాయక్, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరత ఉండకుండా చూడాలని సూచించారు. ఉపయోగంలో లేని వైద్య పరికరాలను తొలగించి, అవసరమైన పరికరాలకు తగిన సిబ్బందిని నియమించి వాటిని సమర్థంగా వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు.
పాఠశాలల వాహనాలు ఫిట్ నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జీపీఆర్ఎస్ ద్వారా పాఠశాల వాహనాలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఉందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. ప్రతీ హాస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార స్థితిని దరఖాస్తుదారులు తెలుసుకునేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించి సమాచారం వారి సెల్ఫోన్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆరోగ్య సదస్సులు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





