- ఇంటి వంటను తలపించే టిఫిన్లు
- అన్ని కట్టెల పొయ్యి మీదే తయారీ
- మారుమూల కాలనీ క్యూ కడుతున్న జనం
అది పెద్దగా జన సంచారం లేని ప్రాంతం. కొంత మంది కార్మికులు మాత్రమే తిరిగే ఏరియా. అక్కడ ఓ నలుగురు గిరాకీతో వృద్ధ దంపతులు చిన్నగా కాక హోటల్‌ను ప్రారంభించారు. అచ్చం పల్లెటూరును తలపించే వాతావరణంలో ఓ చెట్టు కింద ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రారంభించిన ఆ హోటల్‌కు ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. అంతగా ప్రత్యేకత ఏమిటని అనుకుంటున్నారా..? కట్టెల పొయ్యి మీద ఆ అమ్మ వేసే అట్టు. అది తింటే ఇంకోటి వేయమ్మా అనాల్సిందే. ఆ పొయ్యిపై ఓ వైపు అట్లు కాలుతుంటే.. మరో వైపు ఇడ్లీలు ఉడుతుకుంటాయి. వీటిలో వాడే పదార్థాలు కూడా రెడిమేడ్ కాకుండా ఇంట్లో తయారుచేసినవే కావడంతో ఇక్కడ టేస్టు భలే కిక్కుస్తుంది.
చెట్టు కింద మొదలై..
జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలో వ్యవసాయ మార్కెట్ ఏరియాకు చెందిన మంచాల మురుగేశ్వరి తన ఇంటి ముందు చెట్టు కింద సుమారు ఎనిమిదేళ్ల కింద చిన్నగా టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. ఆమె టిఫిన్ తయారు చేస్తే చేతి కింద సాయంగా ఆమె భర్త మనోహర్ ఉండేవాడు. ఇలా ఇద్దరు వృద్ధ దంపతులు కలిసి ఉదయం 6 గంటలకే లేచి టిఫిన్ సెంటర్ నడిపించడం మొదలుపెట్టారు. పాత కాలం పద్ధతిలో వారు కట్టెల పొయ్యి మీద ముందుగా అట్లు పోయడం మొదలుపెట్టారు. పొయ్యి మీద చేసిన వంటకం కావడంతో మంచి రుచి ఉండడంతో కొంచెం గిరాకీ పెరిగింది. దీంతో ఇడ్లి కూడా ప్రారంభించారు. ఆ తరువాత మరింత గిరాకీ పెరగడంతో పూరీ కూడా అందుబాటులోకి తెచ్చారు.
అన్నీ హోం మేడే..
వీరు టిఫిన్లతో పాటు దానికి సంబంధించిన చట్నీ, కర్రీలు కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తారు. పొయ్యి మీద చేయడంతో పాటు ఈ హోటల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. నేరుగా వీరు పట్టించిన కారం, పసుపు, మసాలాలే వాడుతారు. అల్లంవెల్లుల్లి కూడా తమ చేతితో తయారుచేసినవే కావడం గమనార్హం. అందుకే ఇక్కడి టిఫిన్లు ఇంటి వంటను తలపిస్తాయి.
వివిధ గ్రామాల నుంచి కస్టమర్లు..
కనీసం హోటల్‌కు ఒక పేరు, బోర్డు కూడా ఏర్పాటు చేయని వీరు కేవలం క్వాలిటీని మాత్రమే నమ్ముకున్నారు. ఆ నమ్మకమే అనేక ప్రాంతాల నుంచి కస్టమర్లను ఇక్కడికి రప్పిస్తోంది. రోజుకు సుమారు 200 నుంచి 300 మంది వరకు ఇక్కడ టిఫిన్ చేస్తుంటారు. జనగామతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన శామీర్‌పేట, చీటకోడూరు, చౌడారం, మరిగడి, బచ్చన్నపేట నుంచి ఇక్కడికి కస్టమర్లు వస్తున్నారు. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, డిగ్రీ, బీటెక్ విద్యార్థులు వస్తుంటారు. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ హోటల్లో టిఫిన్ దొరుకుతోంది.
కుటుంబమంతా కలిసి..
ముందుగా ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రమే హోటల్‌ను నడిపించేవారు. వీరికి ఇద్దరు కుమారులు నవనీత్, రవీందర్ ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. ఇద్దరు కొడుకులతో పాటు కోడళ్లు కూడా హోటల్ నిర్వహణకు సహకరిస్తారు. గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసిన రవీందర్ ఆ ఉద్యోగం మానేసి తమ సొంత హోటల్లోనే ఉపాధి పొందుతున్నాడు. మొత్తం కుటుంబ సభ్యులే హోటల్‌ను చూసుకుంటారు. గిరాకీ ఎక్కువ కావడంతో ఇటీవలే పూరీలు చేసేందుకు ఓ మాస్టర్‌ను నియమించారు. మొత్తంగా ఇంటిల్లిపాది ఉపాధి పొందడంతో పాటు మరొకరికి ఉపాధినిస్తున్నారు. త్వరలోనే సాయంకాలం రాగి సంకటి, నాటుకోటి పులుసు అందుబాటులోకి తెస్తామని మురుగేశ్వరి చెబుతోంది.
టేస్ట్ బాగుంటుంది
– బర్ల శ్రీనివాస్
నా మిత్రుడు ఒకసారి ఇక్కడ అట్లు తినిపించాడు. టేస్టు బాగుంది. అప్పటి నుంచి దాదాపు నాలుగేళ్లుగా ఈ టిఫిన్ సెంటర్‌కు వస్తున్నా.బస్టాండ్ నుంచి వచ్చిన
– మిద్దపాక రవి
ఇక్కడ కట్టేల మీద కాల్చే అట్లు భలే టేస్ట్‌గా ఉంటాయి. బస్టాండ్ ప్రాంతంలో ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ఇక్కడకే రుచిగా ఉంటాయి. అందుకే ఇక్కడి వస్తాను.