
- క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన హైకమాండ్
- గవర్నర్కు లేఖ పంపిన సీఎంవో
- కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం
హైదరాబాద్, మన చౌరాస్తా : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఆమెను మంత్రివర్గం నుంచి తొలిగిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి గవర్నర్కు అధికారిక లేఖ పంపింది.
హైకమాండ్ ఆగ్రహం
గత కొంతకాలంగా పార్టీ అంతర్గత విషయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విధానాలపై కొండా సురేఖ దంపతులు, వారి కుమార్తె సుస్మితా చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని ఏఐసీసీ స్పష్టం చేసింది.
బర్తరఫ్ లేఖ..
హైకమాండ్ ముందుగా సురేఖ చేత రాజీనామా చేయించాలని చూసినప్పటికీ, అందుకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్ వేటు వేయడమే మార్గమని భావించారు. ఈ క్రమంలో సీఎంవో నుంచి గవర్నర్ ఆమోదం కోసం లేఖను పంపింది.
రాజకీయ మార్పులు..
కొండా సురేఖపై వేటు పడటంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామంపై కొండా దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏఐసీసీ (AICC) ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.




