
- 15.09 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలి
- జ్యోతిష్మతి విద్యాసంస్థల భూ వ్యవహారంపై విచారణ జరపాలి
కరీంనగర్, మన చౌరాస్తా : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని జ్యోతిష్మతి విద్యాసంస్థల పరిధిలో ఉన్న 15.09 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకొని, ప్రజా అవసరాలకు వినియోగించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు డిమాండ్ చేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఐఎఫ్బీ నాయకులు కరీంనగర్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా భూమికి సంబంధించిన ఆధారాలు, రెవెన్యూ రికార్డులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నుస్తులాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 574లో ఉన్న భూమిని తిమ్మాపూర్ తహసీల్దార్ 2007 జూలై 21న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు నాయకులు తెలిపారు. సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిలుపుదల ఉత్తర్వులు ఉంటే వెల్లడించాలి
ఈ భూమికి సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో నిలుపుదల ఉత్తర్వులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులకు తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఏఐఎఫ్బీ నాయకులు ఆరోపించారు. నిజంగా నిలుపుదల ఉత్తర్వులు ఉంటే వాటిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భూమి క్రమబద్ధీకరణ ప్రక్రియను రద్దు చేసి, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. భూమిలో ఉన్న నిర్మాణాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ వసతి గృహాలు, ఇతర ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వ భూములను కాపాడటం అధికారుల బాధ్యతని, ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల్లో ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, 27వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు బద్రి నేత, తిమ్మాపూర్ తహసీల్దార్ కర్రె శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకుడు కాళీ చరణ్ పాల్గొన్నారు.




